Chandrababu: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు..! 6 d ago
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం సీఎం పోలవరం షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని, 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విభజన అనంతరం పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు అని వ్యాఖ్యానించారు.
పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో నేరుగా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ కెనాల్ కు అనుసంధానం చేయాలని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ వస్తే చాలావరకు ఇబ్బంది ఉండదని, వెలిగొండ ఇరిగేషన్ కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని తెలిపారు. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లొచ్చు నేరుగా నీటిని విశాఖకు కూడా తరలించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అక్కడి నుంచి వంశధారకు వెళ్తుందని చంద్రబాబు వివరించారు.
ఈ పనులన్నీ పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగం ఉంటుందన్నారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదని వెల్లడించారు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉందని, 93 మీటర్లు డయాఫ్రం వాల్..అత్యంత ఎత్తైన స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం" అని సీఎం చంద్రబాబు తెలిపారు.